9th తెలుగు – పదజాలం

9th తెలుగు – పదజాలం | Mega DSC Special I Telugu Content

1. ధర్మబోధ

ఉద్దేశ్యం :

మానవులు చేసే ప్రతి పనికి ప్రతి సంకల్పానికి వారి అంతరాత్మ అసలైన సాక్షి. అంతరాత్మను చంపుకుంటే మనిషి తనని తాను వంచించుకున్నట్టే అవుతుంది. గృహస్త ధర్మాన్ని, సంతాన ప్రాధాన్యాన్ని, సత్యం గొప్పదనాన్ని గురించి చెప్పడమే పాఠం ఉద్దేశ్యం.

నేపధ్యం :

విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలని తపస్సు చేస్తున్నాడు. అతని తపస్సు భంగం చేయడానికి దేవతలు మేనకని పంపారు. వారిద్దరికీ ఒక బాలిక జన్మించింది. ఆ శిశువును శకుంత అనే జాతి పక్షులు కాపాడాయి. అందువల్ల ఆమెకి శకుంతల అని నామకరణం చేసి కణ్వ మహాముని పెంచుకున్నాడు. ఒక రోజు దుష్యంతుడు వేట కోసం వెళ్తూ కణ్వ మహాముని ఆశ్రమం దగ్గర ఆగాడు. శకుంతలని చూశాడు. ఆమెను గాంధర్వ వివాహం చేసుకుని తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. శకుంతలకి భరతుడు జన్మించాడు. తల్లి బిడ్డలను కణ్వ మహర్షి అత్తవారింటికి పంపాడు. నిండు కొలువులో దుష్యంతుడు ఆమెను తిరస్కరించాడు. దుష్యంతుడు మాటలు విని కలత చెందిన శకుంతల రాజుకి ధర్మబోధ చేయడమే ఈ పాఠం నేపధ్యం

ప్రక్రియ – ప్రాచీన పద్యం :

ఇతిహాసం అనే పదానికి ఈ విధంగా జరిగింది అని అర్ధం. ఇతిహాసంలో కధకి అధిక ప్రాధాన్యం ఉంటుంది. రామాయణం, భారతం ఇతిహాసాలు. ఇతిహాసాల్లో మూలకధ తీసుకుని వర్ణనలతో ఛందోబద్దంగా పద్యాల రూపంలో కావ్యంగా మలచి రాయడమే ఇతిహాస కావ్యం. ఈ కావ్యాలు కవి ప్రతిభా విశేషాలుని వెల్లడిస్తాయి. అద్భుత కధాగమనంతో పాఠకుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తాయి.

అర్ధాలు :

ఆచార్యుడు – గురువు

విపత్తు – ఆపద

నూనృత – సత్యం

హృద్యం – మనసుకి ఆహ్లాదం కలిగించడం

యశస్సు – కీర్తి

ఊత – ఆధారం

పర్యాయ పదాలు :

భూమి, వసుధ, పుడమి

ఆసరా, ఆధారం

భార్య, సతి, కళాత్రం, ధార

తనయుడు, పుత్రుడు, సుతుడు, కొడుకు

ఏనుగు, కరి, మాతంగం

నానార్ధాలు :

క్రమము, నీటిచాలు, వితరణ, కత్తి అంచు – ధార

పుణ్యం, స్వభావం, న్యాయం, ఆచారం, నీతి – ధర్మం

మానవుడు, అర్జునుడు – నరుడు

దిక్కు, కోరిక, నమ్మకం – ఆశ

కులం, వెదురు, పిల్లనగ్రోవి – వంశం

ప్రకృతి – వికృతి :

పుస్తకం – పొత్తం

నీరము – నీరు

యజ్ఞము – జన్నము

విద్య – విద్దె

గృహము – గీము

దీపము – దివ్వె

సత్యము – సత్తేము

ధర్మం – దమ్మము

రాజ – రేడు

కావ్యం – కబ్బం

వ్యుత్పత్తి అర్ధాలు :

పుత్రుడు – పున్నామ నరకము నుండి తప్పించేవాడు – కుమారుడు

ధర్మం – లోకం చేత ధరించబడేది

పతివ్రత – పతిని సేవించుటయే వ్రతముగా కలది – సాధ్వి

జ్యోత్స్న – కాంతిని కలిగి ఉండేది

వ్యతిరేక పదాలు :

చేసి – చేయక

వస్తాడు – రాడు

తింటే – తినకపోతే

వినండి – వినకండి

చెప్పి – చెప్పక

2. చైతన్యం

ఉద్దేశ్యం :

ప్రతి మానవ సమాజంలో అందరికీ అతీతంగా కొందరు ఉంటారు. వారు భవిష్యత్తును దర్శిస్తారు. ముందుచూపుతో ఆలోచిస్తారు. దారి దీపమై ముందుకు సాగుతారు. వారు తాత్వికులు. వారు తమ మాటల ద్వారా చేతల ద్వారా దిశానిర్ధేశం చేస్తారు. కవి కూడా ఈ కోవకి చెందినవాడే. అతని కవిత్వంలో సామాజిక చైతన్యం కలిగిస్తాడు. కవి తన రచనల ద్వారా ప్రజలను ఆలోచింపజేస్తాడు. ఒక వంక మనిషిలో మంచితనం మెచ్చుకుంటూ కూటిలత్వాన్ని ఎండగడతాడు. ఆ నిబద్ధత తోనే కవి తన మనసులో భావాలు లోకానికి ఈ కవిత రూపంలో వెల్లడించారు. విధ్యార్ధులలో సామాజిక చైతన్యం కలిగించి సమాజాభివృద్ధికి పాటుపడేలా చేయడమే ఈ పాఠం ఉద్దేశ్యం

నేపధ్యం :

కవిత్వానికి ఉండవలసిన ప్రధమ లక్షణం సామాజిక ప్రయోజనం. సమాజంలో అసమానతలు రూపుమాపడానికి కవి తన కలాన్ని కదిలించాలి. ప్రజల గొంతుకగా కవి వినబడాలి. తోటి మానవాళికి అండగా నిలవాలంటే గుండె నిండా ధైర్యం నింపుకోవాలి. సొంత లాభం కోసం కాకుండా పరుల మేలు కోరి పని చేయాలి అని ప్రేరణ ఇస్తూ కవి తన ఆకాంక్ష వ్యక్తం చేస్తున్న సందర్భంలో కవి కలం నుండి జాలువారినదే ఈ గేయకవిత

ప్రక్రియ – గేయ కవిత :

గేయ కవిత పాడుకోవడానికి అనువైనది. మాత్రా ఛందస్సు అనుసరించి నడుస్తుంది. లయాత్మకంగా సాగుతుంది. మానవాళి శ్రేయస్సును సమాజ పురోగమనాన్ని లోక కళ్యాణాన్ని కాంక్షించే గేయాన్ని అభ్యుదయ గేయం అంటారు

అర్ధాలు :

మారుతం – గాలి

చింత – భాద, దుఃఖం

స్థిరమైన – శాశ్వతమైన, నిలకడైన

మానసము – మనసు

క్రూరులు – చెడ్డవారు, దుర్మార్గులు

పర్యాయ పదాలు :

అభ్రములు, జలదరములు, మేఘములు

యుద్ధం, సమరం, పోరు

చుక్కలు, తారలు, నక్షత్రాలు

శోకం, దుఃఖం, ఏడుపు

నానార్ధాలు :

దిక్కు – దిశ, ఉపాయం, మార్గం

వర్షం – వాన, సంవత్సరం

నామం – పేరు, బొట్టు

వాహిని – నది, సైన్యం

లోకం – జగత్తు, చూపు, గుంపు

ప్రకృతి – వికృతి :

అగ్ని – అగ్గి

సింహం – సింగం

రాక్షసి – రక్కసి

కార్యము – కర్జము

మేఘము – మెయిలు

3. హరివిల్లు

ఉద్దేశ్యం :

మనిషికి ప్రకృతికి విడదీయరాని బంధం. ప్రకృతిని తరచి చూడడం మనిషి అలవాటు. ఉదయించే సూర్యుడు, రాలిపడే చినుకు, జల జల పారే నీరు, చిరుగాలి సవ్వడి, పూల పరిమళాలు, కిలకిలారావాలు, చిమ్మచీకటి, చల్లని వెన్నెల ఇలా ప్రతిదీ మనిషిని ఆకర్శించి ఆనందాశ్చర్యాలతో ఓలలాడిస్తుంది. ప్రకృతి అందాలకి పరవశించిన మనిషి మైమరిచిపోతాడు. ఆ తన్మయత్వంలో నుండి జరిగిన కావ్య సృష్టి ప్రకృతికి ప్రతిబింబం అవుతుంది. కవి తన మనసులో భావాలను అందంగా ఆకర్షణీయంగా చెప్పడమే వర్ణన. ఇది కవిలోని సృజనాత్మకతను వెలికి తీస్తుంది. ప్రకృతిలో అద్భుతాలు చూడడం అలవాటైతే మనిషి హృదయంలో సున్నితత్వం విరబుస్తుంది. మానవత్వం మొలకెత్తుతుంది. విచక్షణారహితంగా ప్రకృతిని ధ్వంసం చేసే ప్రవృత్తికి అడ్డుకట్ట పడుతుంది. రసార్ద్రరమైన కవి కలం లోనుంచి జాలువారిన భావ పరంపరను ఆస్వాదించడంతో పాటు ప్రకృతి నుండి పాఠాలను నేర్చుకుంటూ విధ్యార్ధులలో మానవీయత మేలుకొలపడం ఈ పాఠం ఉద్దేశ్యం

నేపధ్యం :

మానవుడు కల్పనాశిల్పి. అతని సౌందర్య తృష్ణ వల్ల తన చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని తిలకించి పులకించి పునరవ్యక్తీకరించగలిగాడు. తన ఎద నుండి పాఠకుని ఎదకి చెరవేయడానికి సాహిత్యాన్ని హేతువుగా చేసుకున్నాడు కవి. నన్నయ్య మొదలుకుని నేటి వరకు కవులు తమ కావ్యాలతో ప్రకృతి వర్ణనలకే పెద్దపీట వేశారు. ప్రబంధాలలో వర్ణనలదే పై చేయి. వర్ణనలు రెండు రకాలు. స్వాభావిక వర్ణనలు, భావాత్మక వర్ణనలు. స్వాభావిక వర్ణనలలో వర్ణించే వస్తువు స్వరూప స్వభావాలు మాటల రూపంలో ఉంటే భావాత్మక వర్ణనలలో అలంకారాలతో కూడి ఉంటాయి. వివిధ సందర్భాలలో కవులు కధానుగుణంగా వర్ణించిన ప్రకృతి దృశ్యాలను పరిచయం చేయడంతో పాటు పద్య రచనా శైలిలో వైవిధ్యాలను పరిశీలించేందుకు అనువుగా ఈ పాఠం రూపొందింది.

ప్రక్రియ – వర్ణన :

రచనా ప్రక్రియ ఏదైనప్పటికి కవి చెప్పిన విషయం పాఠకుని మనసు తాకేదిగా ఉండాలి. అతనిలో భావసంచాలనాన్ని కలిగించాలి. కవి తన రచనతో పాఠకునికి లంకె వేసుకుని తనతో పాటూ నడిపించాలి. ఇందుకోసం కవి వివిధ పద ప్రయోగాలతో తన రచన రసాత్మకం చేస్తాడు. దీనిని వర్ణన అంటారు. విషయాన్ని కేవలం విషయంగా కాకుండా సరైన పోలీకలతో కలిపి వివరిస్తాడు. కావ్యాలలో అష్టాదశ వర్ణనలు ఉంటాయి. ప్రబంధాలు వర్ణనలకు పుట్టినిల్లు. భావ కవిత్వమయినా, అభ్యుదయ కవిత్వమయినా వర్ణనతోనే రచనకి భావాపుష్టి కలుగుతుంది.

అర్ధాలు :

భానుడు – సూర్యుడు

తాండవం – నృత్యం, నాట్యం

మిక్కిలి – అధికం, ఎక్కువ

తత్తరపాటు – కలవరపాటు, తొందరపాటు

కనుమరుగు అవ్వడం – కనబడకపోవడం, మాయమవడం

పర్యాయ పదాలు :

నభం – ఆకాశం, గగనం

ధనువు – ధనస్సు, చాపము, విల్లు, హరివిల్లు

పయోధరము – మేఘము, జలదరము, అంబుదం

కేదారం – పొలం, క్షేత్రం, వరిమడి

సస్యము – పంట, పైరు

వెల్లువ – ప్రవాహం

నెచ్చెలి – స్నేహితుడు, మిత్రుడు

నానార్ధాలు :

ధర – భూమి, వెల, రక్తనాళం

పంక్తి – వరుస, గుంపు

తారక – నక్షత్రం, కంటి గుడ్డు

చుక్క – నక్షత్రం, బిందువు

వ్యుత్పత్తి అర్ధాలు :

సూర్యుడు – వ్యాపారములందు జీవులను ప్రేరేపించువాడు – రవి

ధర – విశ్వమును ధరించినది – భూమి

తోయజము – తోయమందు (నీటి యందు) పుట్టినది – పద్మం

శైలము – శిలలు దీనియందు కలవు – పర్వతం

ప్రకృతి – వికృతి : 

సంధ్య – సందె

చంద్రుడు – చందురుడు

దిశ – దేస

ఆకాశం – ఆకసము

ముత్యము – ముత్తేము

మేఘము – మెయిలు

4. ఆత్మకధ

ఉద్దేశ్యం :

సామాజిక జీవితం సమస్యల వలయం. అందులో ఆటు పోట్లు ఉంటాయి. జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు. తాము నమ్మిన జీవన సూత్రాలను అనుసరించి ఎదిగిన ఎందరో గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని వారి బాటలో నడిచి విజయ శిఖరాలు అధిరోహించిన వారిలో ఈ కవి ఒకడు. సమాజం అతని కృషిని గౌరవించి సమున్నతoగా సన్మానిస్తుంది. కానీ కవి ఆ సన్మానానికి పొంగిపోడు. గతంలో తన జాతి జనులకి జరిగిన అనేక అవమాన పరంపరలు అతని కళ్ల ముందు కదులుతూ ఉంటాయి. వాటి తాలూక దుఖం అతన్ని పట్టి భాదిస్తుంది. విద్య ద్వారానే వ్యక్తికి గౌరవం లభిస్తుంది. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా తాను ఎక్కడ నుండి వచ్చాడో గుర్తెరగాలి. తన మూలాలు మరువకూడదనే సత్యాన్ని తెలపడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశ్యం

నేపధ్యం :

స్వేచ్చ మానవ సహజాతం. వ్యక్తి తన స్వతంత్రానికి భంగం కలిగితే సహించడు. తన హక్కులను అణచవేయాలని ప్రయత్నిస్తే తిరగబడతాడు. పిల్లలు సైతం తమకి ఇష్టం లేకపోతే తల్లిపాలు తాగనంటారు. తల తిప్పుకుంటారు. ప్రతి మనిషికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. తనకి సాటి మనుషుల మధ్య గుర్తింపు కోరుకుంటాడు. సమాజంలో కొన్ని నిరంకుశ భావాలు, కట్టుబాట్లు మనిషి స్వేచ్చకీ సంకెళ్ళు వేస్తాయి. అతడు వాట్ని తెంచుకుని తనలో ఉన్న సృజనాత్మకత శక్తిని ప్రపంచానికి చాటుకుంటాడు. మనిషిలో మంచితనం మానవీయత ప్రపంచం గుర్తించి గౌరవిస్తుంది. అనేకానేక సమస్యలకు కుంగిపోక ఎదురు నిలిచి ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా జ్ఞాన శిఖరాలు అధిరోహించిన ఒకానొక కవి జీవితమే నేటి మన పాఠం

ప్రక్రియ – వచన కవిత :

ఈ పాఠం వచన కవిత అనే ప్రక్రియకి చెందినది. పద్య గేయాల్లో ఉండే ఛందో నియమాలతో సంబంధం లేకుండా వ్యవహారిక భాషలో లయాత్మకంగా సాగే కవిత వచన కవిత. సరళమైన పదాలు, వాక్యాలతో ధ్వని గర్భితముగా ఉండే కవిత వచన కవిత. రచయిత తాను చెప్పదలచుకున్న భావాన్ని సూటిగా స్పస్టంగా చెప్పడం వచన కవిత ప్రత్యేకత. ఆధునిక కవిత్వానికి కొత్త నెత్తురు ఎక్కించిన శ్రీ శ్రీ వచన కవితకి పట్టం కట్టారు. వారి బాటలో నడుస్తున్న ఆధునిక కవులందరు వచన కవితలోనే రచనలు చేస్తున్నారు.

అర్థాలు :

చౌరస్తా – కూడలి

అర్పణము – సమర్పించడం

చురకత్తులు – పదునైన కత్తులు

పర్యాయ పదాలు :

స్వర్ణం – బంగారం, పసిడి, హేమం, కనకం

సూర్యుడు – భాస్కరుడు, రవి, భానుడు, ఇనుడు

కళ్ళు – నేత్రాలు, నయనాలు, చక్షువులు

దేహం – తనువు, శరీరం, కాయం, మేను

నానార్థాలు :

తల – శిరస్సు, గుంపు, చోటు

కాలం – సమయం, మరణం, నలుపు

క్రియ – పని, చర్య

రామ – స్త్రీ, శ్రీరాముడు

ప్రకృతి – వికృతి :

బోజనము – బోనము

బ్రద్న – పొద్దు

కథ – కత

పుష్పం – పువ్వు

5. స్నేహం

ఉద్దేశ్యం :

విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు అన్నారు గౌతమ బుద్ధుడు. మనిషికి అవసర కాలంలో ఆదుకున్న మిత్రుడు కన్నా ప్రియమైనది ఏది ఉండదు అన్నాడు గురునానక్. కష్టకాలంలో మనకి నిజమైన మిత్రుడు ఎవరో తెలుస్తుంది అన్నాడు గాంధీజీ. స్నేహం ప్రతి వ్యక్తి జీవితంలో మధురమైన అనుభూతిగా నిలుస్తుంది. ఆటపాటలు ఆడే వయసులో మొగ్గల ప్రారంభం అయ్యి మహావృక్షంలా ఎదిగి జీవితాంతం తోడుగా నిలుస్తుంది. కొందరితో స్నేహం మనల్ని అత్యున్నత శిఖరాలకి చేరిస్తే కొందరి స్నేహం అధః పాతాళానికి తొక్కేస్తుంది. ప్రతి మనిషి జీవితంలో గొప్ప పాత్ర వహించేది స్నేహం అయినప్పుడు మనం ఎలాంటి స్నేహం ఎంచుకోవాలి ఆ స్నేహం వల్ల కలిగే ప్రయోజనాలు ఏవో తెలపడమే ఈ పాఠం ఉద్దేశ్యం

ప్రక్రియ – పద్యం :

సాహిత్య ప్రక్రియలో విశిస్టమైనది పద్యం. ఇది ఛందోబద్ధమైనది. లయాత్మకంగా, గాన యోగ్యముగా ఉంటుంది. ధారణకు అనువుగా ఉంటుంది. అందుకే మన ప్రాచీన కవులు మొదలు ఆధునిక కవుల వరకు పద్య రచనకి ప్రాధాన్యత ఇచ్చారు. కవి తన రచనలో భావ వ్యక్తీకరణకి అనువుగా కొన్ని ప్రత్యేక పద్య శైలులు ఎంచుకుంటాడు. ఉద్ధతికి విక్రీడిత పద్యాలు, సుకుమారతకు మాలా పద్యాలు, తాత్విక భావాలకు గీత పద్యాలు, పుష్పాపచయాది సందర్భాలకు రగడలు, పంచచామరాలు మొదలైన పద్య రీతులు కావ్యాలలో శోభిస్తాయి

అర్థాలు :

సంపద – ధనం

సౌధము – భవనము

తండులములు – అటుకులు

ప్రతిజ్ఞ – శపథం

సఖ్యత – స్నేహం

పర్యాయ పదాలు :

మిత్రులు, నేస్తాలు, స్నేహితులు

తల్పములు, శయ్యలు, పరుపులు

వసనములు, అంబరములు, వస్త్రాలు

ఉదకము, సలిలం, జలం

పత్రం, దళం, ఆకు

నానార్ధాలు :

విభుడు – ప్రభువు, శివుడు, బ్రహ్మ

కను – చూచు, వెదకు, జన్మనిచ్చి

దళం – ఆకు, భాగం, దండు

ఫలం – పండు, కార్యం, పరిణామం

వ్యుత్పత్తి అర్థాలు :

గురువు – అజ్ఞానం అనే అంధకారమును చేదించేవాడు – ఉపాధ్యాయుడు

మిత్రుడు – సర్వభుతాల పట్ల స్నేహభావం కలవాడు – సూర్యుడు

మోక్షం – జీవున్ని పాశం నుండి విడిపించేది – ముక్తి

పురంధ్రి – గృహాన్ని ధరించేది – ఇల్లాలు

అమృతం – మరణం లేనిది – సుధ

పదాలు – అర్థాలు :

బ్రహ్మానందం – అంతులేని ఆనందం

చక్రపాణి – చక్రము పాణి (చేయి) యందు కలవాడు

కుంభవృష్టి – కుంభం (కుండ) లతో కుమ్మరించినట్టు కురిసే వాన

తళతళలాడే – ప్రకాశించు

ప్రచండ వాయువు – తీవ్రమైన గాలి

ప్రకృతి – వికృతి :

కార్యము – కర్జము

గృహము – గీము

గౌరవం – గారవం

ధర్మము – దమ్మము

లక్ష్మి – లచ్చి

6. తీర్పు

ఉద్దేశ్యం :

బుద్ధుడు నడయాడిన భారతావని శాంతి, సహానాలకి పుట్టినిల్లు. పరోపకారం మనకి జీవనాడి. మనిషిగా జీవించడానికి కొన్ని విలువలు నియమ నిష్టాలు ఏర్పాటు చేసి దాన్ని మానవత్వం అన్నారు. మనిషి పురుషార్ధపరుడు కావాలి అంటారు పెద్దలు. ధర్మబద్ధంగా జీవితాలను కొనసాగిస్తూ జన్మ సాఫల్యం చేసుకోవాలన్నది దీని పరమ ఉద్దేశం. మనస్సు చంచలమైనది. చూచిన ప్రతీదీ తనకి కావాలని ప్రేరేపిస్తుంది. సాధనతో దీన్ని అదుపులో ఉంచుకోవాలి. కరుణ, సత్యం, ధర్మం, న్యాయం, భూతదయ, అహింస, క్షమాగుణం మొదలైన సాత్విక గుణాలను విధ్యార్ధులు అలవర్చుకుని ఉన్నతమైన జీవనం సాగిస్తూ మానవత్వం చాటుకోవాలని తెలపడం ఈ పాఠం ఉద్దేశ్యం.

నేపధ్యం :

ఒకరోజు సిద్ధార్ధుడు రాజకుమారులతో కలిసి వనవిహారానికి వెళ్ళాడు. సిద్ధార్ధుడు ప్రకృతి అందాన్ని సరోవరాలను పంటచేలను పశుకాపర్లను పశు పక్ష్యాదులను చూసి ఆనందిస్తున్నాడు. ఇంకో రాజకుమారుడు దేవదత్తుడు చేత ధనూర్భానాలు ధరించి జంతువుల వేటకి సిద్ధంగా ఉన్నాడు. ఇంతలో ఒక హంసల గుంపు క్రేంకారం చేస్తూ ఆకాశ మార్గంలో పయనిస్తూ ఉండడాన్ని దేవదత్తుడు చూశాడు. బాణం సంధించి ఒక హంసను నేలకూల్చాడు. దీనిని చూసిన సిద్ధార్ధుడు మిక్కిలి వ్యధ చెంది ఆ హంసను రక్షించాడు. ఇది ఇద్దరి మధ్య వాదానికి దారి తీసింది. న్యాయం కోసం రాజస్థానానికి వెళ్లారు. చివరికి హంస ఇద్దరిలో ఎవరికి చెందిదో అనేది పాఠం ద్వారా తెలుస్తుంది

ప్రక్రియ – ఖండ కావ్యం :

చిన్న కధ, కొన్ని పాత్రలు, పరిమిత పద్యాలు గల రచన ఖండ కావ్యం. దీనిలో వ్యర్ధ పదాలకు, వర్ణనలకు అవకాశం ఉండదు. మహాకావ్యాల్లో రసవత్తరమైన ఘట్టాలను పాత్రలను చారిత్రక, దేశభక్తి సన్నివేశాలు మొదలైన వాటిని రమణీయంగా వ్యక్తీకరించడం దీని ప్రత్యేకత. దీనిలో పద్యాలు సంప్రదాయ వృత్తాలలో ఛందోబద్ధంగా ఉంటాయి.

అర్ధాలు :

అంకము – ఒడి 

వినుత్రోవ – ఆకాశ మార్గం

ఆస్య – ముఖం

మారాళము – హంస 

భాస్పములు – కన్నీళ్ళు

పర్యాయ పదాలు :

అంబరము – ఆకాశం, గగనం 

శరం – బాణం, అమ్ము

సరోవరం – సరస్సు, తటాకం

వాక్కులు – మాటలు, పలుకులు

కరములు – చేతులు, హస్తాలు

నానార్ధాలు :

శ్రీ – లక్ష్మీ, సంపద 

ఖగము – పక్షి, బాణం

మధు – తేనె, చైత్రం

ఘృతము – నెయ్యి, నీరు

సోమ – శ్రయము, పరాక్రమం

ప్రకృతి – వికృతి :

లక్ష్మీ – లచ్చీ

హంస – అంచ

న్యాయము – నాయము

రత్నము – రతనము

అంకము – అంకె

భీతి – బీతు

త్రోవ – తోవ

ప్రాణము – పానము

రాక్షసి – రక్కసి

సంతోషం – సంతసము

7. మాట మహిమ

ఉద్దేశ్యం :

నరం లేని నాలుక పరిపరివిధాల వదంతులు పుట్టిస్తుంది. దాని ఫలితంగా ధన, మాన, ప్రాణాలకి ముప్పు వాటిల్లుతుంది. అవయవలన్నింటిలో ప్రధానమైనది మనకి గౌరవం తెచ్చి పెట్టేది నాలుక. విలువైన మాటలే బంధాలను స్నేహాలను పెంచుతాయి. వ్యక్తి సంస్కారానికి మాట గీటురాయి వంటిది. పెదవి దాటి వచ్చే మాటపై అదుపు, పొదుపు అవసరం. మాటతీరు బాగలేకపోతే ఎదురయ్యే కష్ట నష్టాలను తెలపడం, మాట విలువ తెలుసుకుని యోగ్యతతో కూడిన మాటలే మాట్లాడడం అలవరచుకునేలా చేయడం ఈ పాఠం ఉద్దేశ్యం

నేపధ్యం :

మన చుట్టూ రకరకాల మనుషులు ఉంటారు. ఒక్కొక్కరి మాటతీరు ఒక్కోలా ఉంటుంది. కొందరి మాటలు ప్రేమని పంచితే, మరికొందరు మాటలు మనసు ముక్కలు చేస్తాయి. కొందరు మాటలు ధైర్యం నింపితే మరికొందరి మాటలు పిరికితనం నూరిపోస్తాయి. నాలుక అదుపులో ఉంచుకుని మాట్లాడే స్వభావం పెంపొందించుకోవడం ఎంత అవసరమో మోసపు మాటల మాయలో పడకుండా జగరుకతతో ఉండడం అంతే అవసరం

ప్రక్రియ – ఆధునిక పద్యం :

తెలుగు సాహిత్య ప్రక్రియలో విశిస్టమైన ప్రక్రియ పద్యం. పూర్వం సాహిత్య రచనలు అన్నీ పద్య ప్రక్రియలో జరిగేవి. పద్య ముఖ్య లక్షణం ఛందస్సు. పద్యాలలో వృత్తాలు, జాతులు, ఉపజాతులు ఉన్నాయి. ఆధునిక రచయితలపై కూడా ప్రాచీన పద్య ప్రభావం ఎంతైనా ఉంది. అందుకే ఆధునిక రచయితలు తమ భావాలను ప్రాచీన పద్య శైలిలో ఛందోబద్ధంగా రచించడం జరుగుతుంది. ఆధునిక పద్యంలో పద్యశైలి ప్రాచీన పద్య లక్షణాలతో ఉంటుంది. వస్తువు ఆధునికమైనది ఉంటుంది

అర్ధాలు :

పధమున – మార్గము 

మితము – కొద్దిగా

కులాలుడై – కుమ్మరివాడు

దుర్గుణాలు – చెడుగుణాలు

గరళం – విషం

పర్యాయ పదాలు :

నేస్తాలు, మిత్రులు

జిహ్వా – నాలుక, రసజ్ఞ

తిలకించు – చూచు, వీక్షించు

సిరి – లక్ష్మీ, సంపద

నానార్ధాలు :

పయనము – ప్రస్థానం, గమనం

అమృతము – సుధ, నెయ్యి

కాంచుట – చూచుట, పొందు

ప్రకృతి – వికృతి :

భాష – బాస

పుస్తకాలు – పొత్తములు

దూరము – దువ్వు

వర్ణం – వన్నె

హృదయం – ఎద

సహాయం – సాయం

జాతీయాలు :

కంకణం దాల్చు – కార్యం నెరవేర్చే శపధం పట్టడం

గిల్లి జోలబాడటం – మనిషి కింద మంట పెట్టి మీద నీళ్ళు చల్లడం

జుట్టు ముడిపెట్టడం – తగాదా పెట్టడం

వంట జీర్ణించుకోవడం – పూర్తిగా విషయం అవగాహన చేసుకోవడం

8. ఇల్లలకగానే

ఉద్దేశ్యం :

ప్రతి మనిషికి కొన్ని అభిరుచులు ఉంటాయి. ఆడవాళ్ళు పెళ్లవగానే ఇల్లు చక్కదిద్దడంలో లీనమైపోతారు. బరువు బాధ్యతలతో వంటింటి కుందేళ్ళు ఐపోతారు. ఇంటి పనుల్లో పడి కోరికలకు కళ్ళెం వేసుకుంటారు. అభిరుచులు ఆటకెక్కిస్తారు. భర్త, పిల్లలను చూసుకోవడం భాగ్యం అనుకుంటారు. చివరికి తమ అస్తిత్వం కోల్పోతారు. వివాహితకు కుటుంబం అండగా నిలిస్తే వారు విజయ బావుటా ఎగురవేస్తారు. స్త్రీల ఆత్మాభిమానం పెంపొందించుకోవాలి అని తెలపడం ఈ పాఠం ఉద్దేశ్యం

ప్రవేశిక :

వివాహం అయిన స్త్రీ తన చదువు, సృజనాత్మకత, నైపుణ్యాలు పక్కన పెట్టాల్సి వస్తుంది. యంత్రంలా పని చేస్తున్న క్రమంలో తనకో పేరు ఉంది అని మర్చిపోతుంది. ఇంటి పనిలో మునిగి స్వీయ చైతన్యం ఆత్మ గౌరవం కోల్పోవడంలో అనౌచిత్యాన్ని ఈ కధ ద్వారా తెలుసుకుందాం

ప్రక్రియ – కధ :

తెలుగు సాహిత్యంలో కధ ఒక ప్రధాన ప్రక్రియ. వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సంఘటనలు వివిధ పాత్రల ద్వారా గొప్ప శిల్ప నైపుణ్యంతో గుండెకి హత్తుకునేలా చెప్పే వచన రచనే కధ. ప్రస్తుతం కధ, కధానిక అనే రెండు పదాలు ఒకే అర్ధంలో వాడుతున్నాం. ఎందరో రచయితలు తమ కధల ద్వారా తెలుగు సాహిత్యం పరిపుష్టం చేస్తున్నారు

అర్ధాలు :

నేర్పరి – నైపుణ్యం, ప్రావీణ్యం  

తీర్చి దిద్దిన – బాగుపరిచిన, రూపొందించిన

భుజం తట్టడం – ప్రోత్సహించడం, ప్రేరణ కలిగించడం

విధ్యార్జన – జ్ఞాన సంపాదన

పర్యాయ పదాలు :

గుర్తు – సంకేతం, జ్ఞాపకం, సంజ్ఞ

బట్టలు – వస్త్రాలు, వలములు, చెలములు

ఉత్తరాలు – జాబులు, లేఖలు

తపన – కోరిక, ఆశ, ఈప్పితం

ఇల్లాలు – భార్య, శ్రీమతి, సతి

ప్రకృతి – వికృతి :

తీరం – దారి

గౌరవం – గారవం

ప్రాణము – పానము

భాష – బాస

ఆశ్చర్యం – అచ్చెరువు

సామాన్య వాక్యాలు – సంయుక్త వాక్యాలు :

రాధ పాట పాడుతున్నది. రవి పాట పాడుతున్నాడు – రాధ, రవి పాట పాడుతున్నారు

సాందీపుడు గురువు. శ్రీకృష్ణుడు శిష్యుడు – సాందీపుడు, శ్రీకృష్ణుడు గురుశిష్యులు

రవి బజారుకి వెళ్ళాడు. రఘు బజారుకి వెళ్ళాడు – రవి, రఘు బజారుకి వెళ్లారు

భీముడు వీరుడు, అర్జునుడు వీరుడు – భీముడు, అర్జునుడు వీరులు

సామాన్య వాక్యాలు – సంశ్లిష్ట వాక్యాలు :

శైలజ నడుస్తున్నది. శైలజ పాట పాడుతున్నది – శైలజ నడుస్తూ పాట పాడుతున్నది

నెమలి వేగంగా వచ్చింది. నెమలి పాముని చూసింది – నెమలి వేగంగా వచ్చి పాముని చూసింది

నేను ఉదయాన్నే లేచాను, నేను వ్యాయామం చేశాను – నేను ఉదయాన్నే లేచి వ్యాయామం చేశాను

ఏనుగు తొండం ఎత్తింది, ఏనుగు ఘీంకరించింది – ఏనుగు తొండం ఎత్తి ఘీంకరించింది

9. రంగస్థలం

ఉద్దేశ్యం :

కళారూపాలు ఆస్వాదించే వారికి ఆనందం పంచుతాయి. మానవుడు సంఘ జీవనం మొదలు పెట్టిన నాటి నుండి మనోల్లాసం కలిగించే అనేక రకాల ఆటపాటలు జీవితంలో భాగం చేసుకున్నాడు. కాలక్రమంలో అవి కళారూపాలుగా రూపుదిద్దుకున్నాయి. హరికధ, బుర్రకధ, చిందు భాగవతం, యక్ష గానం మొదలైనవి అన్నీ ఈ కోవకి చెందినవే. అలాంటివాటిలో ఒకటైన నాటకం గురించి దాని ఔన్నత్యం గురించి వివరించడం ఈ పాఠం ఉద్దేశ్యం

నేపధ్యం :

నాటకం ఒక కళారూపం మాత్రమే కాదు, ఒక గొప్ప సాహితీ ప్రక్రియ కూడా. ఎందరో లబ్ధ ప్రతీష్టులైన కవులు అనేక నాటకాలు రాశారు. నటీనటులు తమ అద్భుత నటనతో వాటికి దృశ్య రూపం కల్పించారు. అనేక నాటక సమాజాలు నాటకాలు ప్రదర్శిస్తూ వాటికి ఆదరణ కల్పించాయి. అత్యున్నత శిఖరాలు అధిరోహించిన నాటక రంగం సినిమా ప్రవేశంతో తన ప్రభావం కోల్పోయింది. కేవలం వినోదం పంచడంతో సరిపెట్టుకోకుండా సామాజిక సమస్యలు, సాంఘిక దురాచరాలని ఎత్తి చూపుతూ కొత్త పుంతలు తొక్కుతూ ఈనాటికీ తన ఉనికిని చాటుకుంటున్న నాటకం గురించి నేటి తరం తెలుసుకోవడం ఎంతో అవసరం

ప్రక్రియ – వ్యాసం :

ఒక విషయం గురించిన సమాచారం విశేషాలు పాఠకులకి అర్ధం అయ్యేలా సంగ్రహంగా రాసే ప్రక్రియను వ్యాసం అంటారు. వ్యాసానికి ఒక స్పష్టమైన ప్రారంభం, వివరణ, ముగింపు అనే లక్షణాలు ఉంటాయి. రచయిత విషయాన్ని కూలంకుశంగా పరిశీలించి అవసరం అయిన సమాచారం క్రోడీకరించి వ్యాసం రాస్తారు

నాటికలు – రచయితలు :

ఆత్మ వంచన – బుచ్చిబాబు

తేలుకుట్టిన దొంగలు – పొట్లూరి వేంకటేశ్వర రావు

కప్పలు – ఆత్రేయ

కంఠాభరణం – పానుగంటి

గృహప్రవేశం – మునిమాణిక్యం

సరిపడని సంగతులు – బళ్ళారి రాఘువ

సత్యం గారి ఇల్లు ఎక్కడ – గొల్లపూడి

అర్ధాలు :

కనుమరుగు – కనపడకపోవడం

హర్షధ్వనాలు – చప్పట్లు, కేరింతలు

నిత్యనూతనం – ఎల్లప్పుడూ కొత్తగా

సమ్మేళనం – కలయిక

ఆద్యంతం – మొదట నుండి చివర వరకు

పర్యాయ పదాలు :

స్త్రీలు, మహిళలు

గ్రామం, పల్లెటూరు

హాస్యం, నవ్వు

నృత్యం, నాట్యం

వీక్షకులు, ప్రేక్షకులు

నానార్ధాలు :

ఉల్లాసం – ఆనందం, ఉత్సాహం

చేరువ – దగ్గర, సాన్నిత్యం

నూతనం – కొత్త, వింత

కాలం – సమయం, మరణం, నలుపు

కృషి – ప్రయత్నం, వ్యవసాయం, పరిశ్రమ

10. ప్రియమైన నాన్నకు

ఉద్దేశ్యం :

మనిషి ప్రేమతో నిండిన ప్రేమకు పులకరిస్తాడు. ఆత్మీయంగా హత్తుకుంటే ఆనందిస్తాడు. ఆధునిక కాలంలో మనిషికి ఉరుకుల పరుగుల జీవనశైలి నిత్యకృత్యం అయింది. అమ్మ నాన్నలను అయిన వాళ్ళను ఆత్మీయులను పాలకరించుకుని మనసు విప్పి సుఖదుఃఖాలు పంచుకునే కాలమే నేడు కరువైంది. సాంకేతిక పరిజ్ఞానం మనిషిని యాంత్రికుని చేసి తన చుట్టూ తిప్పుకుంటుంది. ఈ నేపధ్యంలో మనసులో మాటలను మమతలను ఒకరినొకరు పంచుకునేలా చేయగల ఏకైక సాధనం ఉత్తరం. బాలలలో లేఖ రచన పట్ల ఆసక్తి పెంపొందించి కుటుంబ విలువలు కాపాడడం మానవ సంబంధాలు భాంధవ్యాలకు ప్రాణం పోయడమే ఈ పాఠం ఉద్దేశ్యం

నేపధ్యం :

ఉత్తరం ద్వారా వాస్తవిక సంఘటనలు, అనుభవాలు, ఆలోచనలు ఆసక్తికరంగా వ్యక్తీకరించడం జరుగుతుంది. ఉత్తరం రాయడం ఒక కళ. మన అనుకున్నవారి బాగోగులు భావోద్వేగాలును ఉత్తరం రూపంలో అందుకుంటే కలిగే ఆనందానికి అవధులు ఉండవు. ఉత్తరం చదువుతుంటే రాసినవారు ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్న అనుభూతి కలుగుతుంది. ఆత్మీయ బంధం పెనవేసుకుంటుంది. అందుకే ఉత్తరం పదే పదే చదువుతూ గుండెకు హత్తుకుంటాం. పదిలంగా దాచుకుంటాం. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాలు అయిన వాట్సప్, మెయిల్ ఇలాంటి అనుభూతి ఇవ్వలేవు. ఆత్మీయతలు, ప్రేమనురాగాలు పెంపొందాలన్నా మనుషుల మధ్య దూరం తగ్గాలన్నా లేఖ అత్యుత్తమ సాధనం. పిల్లల ఎదుగుదల కోసం తాను కొవ్వొత్తిలా కరిగిపోతూ బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని నిరంతరం తపించిన తండ్రిని తలచుకుంటూ ఒక కూతురు తండ్రికి రాసుకున్న ఉత్తరమే ఈ పాఠం

ప్రక్రియ – లేఖ :

తెలుగు సాహిత్యంలో లేఖా రచన ఒక అద్భుత ప్రక్రియ. వ్యక్తులు, సంస్థల మధ్య సమాచారం పరస్పరం పంచుకోవడానికి ఉపయోగించే సాధనమే లేఖ. లేఖల ద్వారా తమ భావాలు, అనుభవాలు, అభిప్రాయాలు వ్యక్తం అవుతాయి. కేవలం విషయ సమాచారమే కాకుండా ప్రముఖులు రాసిన లేఖల్లో సాహితీ విలువలు ఉంటాయి. అందువల్ల వచన రచనలో ఒక సాహిత్య ప్రక్రియగా లేఖను పేర్కొంటారు. ఎందరో రచయితలు లేఖల రూపంలో తన హృదయాన్ని ఆవిష్కరించారు. సంజీవ దేవ్ లేఖలు, నెహ్రూ లేఖలు, చలం లేఖలు, ఔరంగజేబు లేఖలు, అబ్రహం లింకన్ లేఖలు ఈ కోవకి చెందినవే. కొందరి లేఖలు ఆలోచింపజేస్తే మరికొందరి లేఖలు ఆనందింపజేస్తాయి. అందుకే లేఖలను చైతన్యానికి ప్రతీకలు అంటారు

అర్ధాలు :

ఉరకలు – పరిగెత్తడం, ప్రవహించడం

కరువు – దుర్భిక్షo, క్షామం   

స్మృతులు – జ్ఞాపకాలు

అస్తిత్వం – ఉనికి

పర్యాయ పదాలు :

ఎద, హృదయం

లేఖ, ఉత్తరం

జ్ఞాపకం, మననం

లేమి, వెలితి

ఆత్రుత, తొందర

పశువు, గొడ్డు

నానార్ధాలు :

భోగం – పాము పడగ, శుభం, కీర్తి,భోజనం, తపస్సు, భువనం, మరదలు (మేనమామ పుత్రిక)

ప్రకృతి – వికృతి :

కుమారుడు – కొమరుడు

శ్రీ – సిరి

పంక్తి – బంతి

క్షేమం – సేమము

ఆశ – ఆస

11. ఆశావాది

ఉద్దేశ్యం :

విధ్యార్జనకు పుట్టుపూర్వోత్తరాలు, ఆర్ధిక అసమానతలు అవరోధాలు కావు అని నిరూపించిన ధీశాలి ప్రకాశరావు. పట్టుదల, కృషి ఉంటే అక్షర సింహాసనం ఎక్కి సాహితీ సామ్రాజ్యం ఏలవచ్చు అని నిరూపించి చూపిన కార్యదక్షుడు. పద్య రచనలో పట్టు సాధించి కొందరికే పరిమితం అయిన అష్టావధాన ప్రక్రియలో రాణించడం ద్వారా అత్యున్నత పద్మ శ్రీ పురష్కారం అందుకుని నేటి తరానికి స్పూర్తి ప్రదాతగా నిలిచిన ఆ మహానీయుని సాహితీ జీవన ప్రస్థానం తెలపడం ఈ పాఠం ఉద్దేశ్యం.

ప్రక్రియ – ముఖాముఖి :

ఉన్నత శిఖరాలు అధిరోహించిన మహనీయుల జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. మరెన్నో వెలుగునీడలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవడం ద్వారా మన జీవితం సుగమం చేసుకోవడానికి వీలు అవుతుంది. ప్రశ్నలు అడగడం ద్వారా సమాచారం సేకరించడమే ముఖాముఖి. సేకరించిన సమాచారం ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా పాఠకులకు అందించడం జరుగుతుంది. ముఖాముఖి ద్వారా వ్యక్తుల వ్యక్తిత్వం వారి అనుభవాలు, జీవిత విశేషాలను స్వయంగా వారి ద్వారా తెలుసుకునే వీలు ఉంటుంది

ప్రవేశిక :

సాహితీ వ్యవసాయంలో పద్య సేద్యం చేసిన ఓ భాషా పరిమళం, సుందర శబ్దాలతో అందమైన పద్యాలు అల్లిన ఓ అష్టవధాన రూపం ఆశావాది ప్రకాశరావు. నీదే కులం అని అడిగిన వారికి నాది కవికులం అని చాటిన కవితావాది ఆశావాది. అవధానం కొందరి సొత్తు. అది నీవెలా చేస్తావు ఆన్న అవహేళనలకు తన సాహిత్య పటిమతో సమాధానం ఇచ్చిన సౌజన్యమూర్తి. తెలుగు భాషకే సొంతం అయిన అవధాన ప్రక్రియలలో వారు అగ్రశ్రేణిలో నిలిచారు. తిరుపతి వెంకట కవులను ప్రేరణగా తీసుకుని సి వి సుబ్బన్న శతావధానిని గురువుగా నిలుపుకుని వారి సాహితీ ప్రస్థానం విశిష్ట పురష్కారాలకు వేదికైంది. అలనాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారిచే బాలకవిగా పిలిపించుకుని మొన్నటి రాష్ట్రపతి రామనాధ్ కోవిoద్ చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్న భాషాజీవి. ప్రస్తుత పాఠ్యభాగం ఆశావాది ప్రకాశరావు రచించిన “ప్రకాశ ప్రదీపనం” లోనిది

అర్ధాలు :

గోష్టి – చర్చ 

ఆశువు – అప్పటికి అప్పుడు చెప్పే కవిత్వం

పృచ్చకులు – అష్టవధానంలో ప్రశ్నించేవారు (8 మంది ఉంటారు)

పర్యాయ పదాలు :

నేత్రం – నయనం, కన్ను, అక్షి   

నాన్న – తండ్రి, జనకుడు

కౌముది – వెన్నెల, చంద్రిక

నానార్ధాలు :

కవి – కవిత్వం రాసేవాడు. నీటికాకి 

గురువు – ఉపాధ్యాయుడు, బృహస్పతి

కృషి – ప్రయత్నం, వ్యవసాయం

వ్యుత్పత్తి అర్ధాలు :

కృతులు –

పౌత్రుడు – పుత్రుని యొక్క పుత్రుడు 

ఆచార్యుడు – ధర్మ మార్గం ఆచరించి చూపువాడు

ప్రకృతి – వికృతి :

 దైవం – దయ్యం

కార్యం – కర్జము

పద్యం – పద్దెము

కీర్తి – కిరీతి

కవిత – కయిత

విజ్ఞానం – విన్నానం

అక్కరం – అక్షరం

సందియం – సందేహం

జాతీయాలు :

ఎత్తిపొడుపు – నిందించడం

కత్తి మీద సాము – చాలా దుర్లభం, కష్టతరం

తామరతంపర – కుప్పలు తెప్పలు, కోకొల్లాలు 

12. ఏ దేశమేగినా

ఉద్దేశ్యం :

తెలుగులో పద్యం, కధ, వచన కవిత మొదలైన ప్రక్రియలతో పాటు యాత్రా రచన కూడా ఒక సాహితీ ప్రక్రియ. దాని పట్ల విద్యార్ధులకు అవగాహన కలిగించడం, రచయిత్రి తన విదేశీ యాత్ర అనుభవాలను పరిచయం చేయడం, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల పట్ల విదేశీయుల మనోభావాలు తెలపడం ఈ పాఠం ముఖ్య ఉద్దేశ్యం.

నేపధ్యం :

“ఈనాడు ఊసుపోక ఊరికే తిరిగే లోక సంచారులు కాదు ప్రపంచానికి కావలసినది. తమ తిరుగుడుకి సార్ధకత కల్పించగల లోక సంచారులు కావాలి. అంటే దేశాలు తిరిగి తాము సంపాదించిన అనుభవాన్ని, చూసిన ప్రదేశాల వివరాల్ని ఏ కారణం వల్లనో దేశాలు తిరగలేక స్థిరవాసులయిన లక్షలాది మంది ప్రజలకు అందించగలిగి ఉండాలి లోకసంచారులు” అని లోకసంచారి అనే పుస్తకంలో ప్రముఖ చారిత్రక సాంస్కృతిక హిందీ రచయిత రాహుల్ సాంకృత్యాయన్ వెల్లడించారు

సరిగ్గా అలాంటి ఒక సదుద్దేశ్యంతో శ్రీమతి ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మ గారు భారత ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా వివిధ దేశాలు పర్యటించారు. ఆ పర్యటన సాగిన విధానం ఆమె పొందిన అనుభవాలు, విశేషాలను ఈ పాఠం చదివి తెలుసుకుందాం

ప్రక్రియ – యాత్రా రచన :

యాత్రికుడు తాను పొందిన యాత్రనుభవాలను గ్రంధస్థం చేయడం యాత్రా రచన. వ్యక్తులు స్వదేశంలో కానీ విదేశంలో కానీ విశిష్టత గల దర్శించినపుడు అక్కడి విశేశాలను పొందిన అనుభూతిని అనుభవాలను వివరిస్తూ వర్ణనాత్మకంగా రాయడమే యాత్రా రచన.

నేటికీ ఏ తీర్ధ యాత్రకో, విహార యాత్రకో వెళ్ళి వచ్చిన వారు తమ స్నేహితులతో ఇరుగుపొరుగువారికో అక్కడ వింతలు, విశేషాలు కధలు కధలుగా చెప్పడం చూడవచ్చు. యాత్రా రచనలు చదువుతునప్పుడు పాఠకుడు తాను కూడా అక్కడ ఉన్నట్లు అనుభూతి చెందుతాడు. పిల్లలు కూడా తాము వెళ్ళిన ఊళ్ళ గురించి విజ్ఞాన యాత్రల గురించి యాత్రా రచన చేయడం అవసరం. ఇది తమ అనుభవాలకి అక్షర రూపం కల్పించడం

రచన – గ్రంధకర్త :

ఆటా జనికాంచె – ఎండ్లూరి సుధాకర్

ఇనుపతేరనెనుక – రావూరి భరద్వాజ

నవ భారతి – మాలతీ చందూర్

రష్యాలో స్నేహాయాత్ర – వసా ప్రభావతి

నేను చూసిన అమెరికా – అక్కినేని నాగేశ్వర రావు

కాశీ యాత్ర చరిత్ర – ఏనుగుల వీరాస్వామి

అర్ధాలు :

జోతలు – నమస్కారాలు

సమాగమం – కలయిక

సాధ్వి – పతివ్రత

కలగుండు – కలవరం

ఉత్కృష్టం – గొప్పగా

అధిరోహించిన – ఎక్కిన

పర్యాయ పదాలు :

జాబు, ఉత్తరం, లేఖలు

ఆదేశం, ఆజ్ఞ, అనుజ్ఞ

జ్ఞప్తి, స్మృతి, జ్ఞాపకం

ప్రకృతి – వికృతి :

దీపము – దివ్వె

మాణిక్యం – మానికం

యత్నం – జతనం

యాత్ర – జాతర

నిత్యం – నిచ్చెలు   

13. నా చదువు

ఉద్దేశ్యం :

విద్య వలన వినయం వినయం వలన పాత్రత కలుగుతుంది అనేది ఆర్ష వాక్యం. అంటే విద్య వ్యక్తి అభివృద్ధితో పాటు సమాజాభివృద్ధికి తోడ్పడుతుంది. విద్యాభ్యాసం కోసం ఎంతోమంది ఎన్ని ఆటంకాలు వచ్చిన ఎదురీది వివిధ ప్రయత్నాలు చేసి సఫలీకృతులయ్యారు. అలాగే కోరుకున్న రంగంలో రాణించి దేశాభివృద్ధిలో భాగస్వాములయ్యారు. విద్యార్ధులకు అలాంటి వ్యక్తుల జీవిత విశేషాలు తెలిపి వారి బాటలో నడిచేలా చూడడం దేశాభివృద్ధికి పాటుపడేలా చేయడం ఈ పాఠం ఉద్దేశ్యం

నేపధ్యం :

తెలుగులో వచన కవిత్వానికి పట్టం కట్టిన ప్రముఖ రచయితలలో శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి గారు అగ్రగణ్యలు. ఆధునిక తెలుగు కధకి గురజాడ బీజం వేస్తే తరవాత శ్రీపాద వారు దానికి జవజీవాలు కల్పించారు. పద్య కవిత ప్రభావానికి ఎదురొడ్డి తెలుగు సాహిత్యాన్ని ఆధునిక వచన రచన వైపుకి చేయి పట్టి నడిపించిన వైతాళికుడు శ్రీపాద. వీరు చక్కని తెలుగుదనంతో గ్రామీణ నేపధ్యంతో కధలు, కావ్యాలు రాయడంలో సిద్ధహస్తులు. ఈయన తన చిన్నతనంలో చదువు సాగించిన తీరుకు ఒక ప్రత్యేకత ఉంది. నాడు తన విద్యాభ్యాసంలో ఎదురైన సమస్యలు వాటిని అధిగమించిన విధానం నేటి తరానికి మార్గదర్శకం. శ్రీపాద వారు తన చిన్ననాటి సామాజిక స్థితిగతులను అవకాశాలుగా మార్చుకుని రచయితగా కవిగా ఎదిగిన తీరు తన ఆత్మకధ “అనుభవాలు – జ్ఞాపకాలునూ” లో వివరించారు. అందులో తన బాల్యం, విద్యాభ్యాసం గురించి తెలిపే నేపధ్యం లోనిది ఈ పాఠ్యాంశం.

ప్రక్రియ – ఆత్మకధ :

వ్యక్తి తన జీవిత అనుభవాలు, అభిప్రాయాలు కలబోసి తనకి తానే రాసుకునే సాహితీ ప్రక్రియ ఆత్మకధ. తనకై తాను రాసుకున్న జీవిత చరిత్ర. అవి ఆత్మకధలే అయినా సామాజిక జీవితాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. ఇది ఉత్తమ పురుష కధనంలో ఉంటుంది. ఆత్మకధలు చదవడం ద్వారా పాఠకుడు రచయితతో కలిసి పయనిస్తున్నట్లు అనుభూతి చెందుతాడు. అందుచేత ఎన్ని ఆత్మకధలు, జీవిత చరిత్రలు చదివితే అన్నీ జీవితాలను ఏకకాలంలో జీవించినవారమవుతాము అంటారు.

ఆత్మకధలు :

సత్య శోధన – మహాత్మా గాంధీ

నేను – నా దేశం – దరిశి చెంచయ్య

నా ఎరుక – అధిబట్ల నారాయణదాసు

పింజారి – షేక్ నాజర్

హంపి నుండి హరప్పా దాకా – తిరుమల రామచంద్ర

నా జీవిత యాత్ర – టంగుటూరి ప్రకాశం పంతులు

నా గొడవ – కాళోజీ నారాయణరావు

నా అంతరంగ కధనం – బుచ్చిబాబు

సాలగ్రామం – కపిలవాయి లింగమూర్తి

అర్ధాలు :

సఫలం – విజయవంతం

ప్రాప్యo – పొందదగినది

పారంగతుడు – నిష్ణాతుడు

ప్రవర్తన – నడవడిక

దీక్షాపరుడు – అనుకున్న కార్యం నెరవేర్చేవాడు

ఉడాయించడం – వెళ్ళిపోవడం

పర్యాయ పదాలు :

మార్గం, తోవ, దారి

రహస్యం, గుట్టు, మర్మం

గూడు, గృహం, సదనం, ఆవాసం

సీమ, ప్రాంతం, ప్రదేశం

మహిళ, వనిత, స్త్రీ

నానార్ధాలు :

పూనిక – యత్నం, సన్నాహం 

నిర్మాణం – ఆకృతి, కల్పన

దృక్పధం – అభిప్రాయం, మార్గం

పాదు – కుదురు, ఆవాసం

సుతరాం – ఏమాత్రం, కొంచెమైనా

ప్రకృతి – వికృతి :

విద్య – విద్దె

దేవళం – దేవాలయం

వీది – వీధి

నిదుర – నిద్ర 

చట్టం – శాస్త్రం

రాతిరి – రాత్రి

దిస్టి – దృష్టి 

14. ఆకుపచ్చశోకం

ఉద్దేశ్యం :

భూగోళం మీద జీవకోటికి ప్రాణవాయువు ఇచ్చి పచ్చదనం పెంచేవి చెట్లు. నాగరికత పేరుతో మనిషి ప్రకృతిని విచక్షణ లేకుండా కొల్లగొడుతున్నాడు. అవసరాన్ని మించి అడవులు ధ్వంసం చేస్తున్నాడు. ప్లాస్టిక్ భూతం ఒక వైపు అడవుల నరికివేత మరోవైపు పర్యావరణాన్ని ప్రమాదంలో పెడుతున్నాయి. ఈ ప్రమాదం గుర్తెరిగి పర్యావరణం కాపాడవలసిన అవసరం గూర్చి తెలపడమే ఈ పాఠం ఉద్దేశ్యం.

ప్రక్రియ – పర్యావరణ కవిత్వం :

తెలుగు సాహిత్యంలో పర్యావరణ కవిత్వం ఒక ఆధునిక ప్రక్రియ. మానవ కార్యకలాపాల వల్ల ప్రకృతికి పర్యావరణానికి కలుగుతున్న హానిని దానివల్ల కలిగే పర్యవసానాలను తెలపడమే పర్యావరణ కవిత్వం ఉద్దేశ్యం. పర్యావరణ భావనలను రచయిత కవిత రూపంలో వ్యాసరూపంలో వ్యక్తీకరిస్తారు. అందువల్ల దీనిని కవితా వ్యాసం అంటారు

అర్ధాలు :

హరితం – పచ్చదనం 

ఉపద్రవం – ప్రమాదం

బాహువులు – చేతులు

ఛాయ – నీడ

గరళం – విషం

పర్యాయ పదాలు :

చెట్లు – తరువులు, భుజములు

ముస్తాబు – అలంకరణ, అందంగా తయారు చేయడం

జాడ – గుర్తు, ఆనవాలు

తాపం – వేడి, ఉష్ణం, సెగ

సముద్రం – పయోధి, జలది

నానార్ధాలు :

ఎండ – వెలుగు, అతపం

కాలం – సమయం, నలుపు

కాయం – శరీరం, గురి, స్వభావం

జాడ – విధం, ఆచూకి, దారి

దాహం – దప్పిక, కాలడం

ప్రకృతి – వికృతి :

మనిషి – మానిసి

పట్టణం – పత్తనం

సముద్రం – సంద్రం

ఛాయ – చాయ

కధ – కత

జాతీయాలు :

పానకంలో పుడక – సందర్భానికి సంబంధం లేకుండా ఆటంకం కలిగించడం  

తామరతంపరగా – తొందరగా విస్తరించడం

కూర్చున్న కొమ్మను నరుక్కోవడం – ఆశ్రయం ఇచ్చిన వారినే చెడగొట్టడం

నిమ్మకు నీరెత్తినట్లు – ఎలాంటి సమస్య ఉన్నా నిబ్బరంగా ఉండడం

నడుం కట్టాలి – ఒక పని పూర్తి చేయడానికి పూర్తిగా సంసిద్ధం చేయడం